Sep 4, 2012

తాబేలు తెలివితేటలు!

హలో

మీకు తెలివితేటలూ ఉన్నాయా? :)
మన అందరికి వున్నాయి...కదా ! మనకి ఎదురయ్యే సంఘటనల నుంచి , మనకి ఆసక్తికరమైన విషయాల నుంచి, మన ప్రక్క వారినుంచి, మన సమాజం నుంచి - అందరి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాము.  ప్రతీ ఒక్కటి మనం మన స్వంత అనుభావాలనున్చే కాక , ప్రక్కవారి అనుభవాల నుంచి కుడా నేర్చుకుంటాము, నేర్చుకోవాలి! దానికి సాధ్యమైనంతగా పరిసరాలను గమనించటం, మంచి పుస్తకాలు చదవటం , మంచి చర్చల్లో పాల్గోవటం వంటివి ఎంతో ఉపయోగపడతాయి.
ఇవాల్టి మన కథలో ..తాబేలు , భలే మంచి ఉపాయం తో, తెలివితేటలతో   - ఏనుగు, నీటి గుర్రాలతో స్నేహం చేసింది. అదెలాగో విందామా !!?? :)

Aug 28, 2012

నక్క - తాబేలు

హలో ... :)
గెలుపు , ఓటమి లు  దైవాధీనాలు . పోటి తత్త్వం అన్నివేళలా మంచిదే ! కానీ  గెలుపు ని ఎలా తీసుకుంటామో , ఓటమి ని కూడా అలాగే తీసుకోవాలి. ఓటమి కూడా సర్వ సాధారణం !!  ఓడిపోయామని బెంగపడకుండా... ఓటమికి కారణాలు తెలుసుకుని , విజయం కోసం మళ్ళి  ప్రయత్నించాలి.
 
గెలుపు - విజయాన్ని, ఆనందాన్ని ఇస్తే ...
ఓటమి - అనుభవాన్ని ఇస్తుంది. తప్పొప్పులు తెలుసుకుని మనల్ని మనం మరింత మెరుగుపర్చుకోవటానికి  అవకాశాన్ని ఇస్తుంది !

ఈ క్రింది కథలో తాబేలు - సమయస్ఫూర్తితో ఆపదనుంచి బయటపడి విజయం సాధిస్తే ... నక్క - భంగపడి గుణపాఠం నేర్చుకుంది. తాబేలు డొప్పలు నీళ్ళల్లో నానవని తెలుసుకుంది ! :)
మనం కుడా ఆ కథ వినేద్దామా ??!!
Aug 8, 2012

ఏడు చేపల కథ !

నా చిన్నప్పుడు   అమ్మ ఎన్ని కథలు చెప్పినా... ఈ ఏడు చేపల కథ మాత్రం బాగా గుర్తుండిపోయినదీ మరియు ఇష్ట మైనదీ!! :)
ఆఖర్న చీమ " నా పుట్ట లో వేలు పెడితే కుట్టనా ??? " అని సాగాదీసుకుంటూ అడిగిన విధానం నాకు బాగా గుర్తుండిపోయింది.  తర్వాత పెద్దయ్యాక, భక్తీ టీవీ లో ఒక పెద్దాయన ...ఈ కథలోని అంతర్యాన్ని చెబితే.... ఓహో ... ఇంత విషయం ఉందా ఈ చిన్ని కథలో అని తెలుసుకుని నివ్వెరపోయాను... ఆ తర్వాత ఈ కథ మీద మరింత ప్రేమ పెరిగింది. ఈ క్రింద నేను రికార్డు  చేసిన విధం గా,  మా అబ్బాయికి ఈ కథ చెబుతూ సంతోషపడుతుంటాను  ... మీరు కూడా మరి ఒకసారి ఈ కథ విని, ఆనందించండి.

ఈ కథ లోని ఆంతర్యం , స్మరణ అనే బ్లాగ్ లో చూసాక ... ఈ కథ ని మళ్ళి రికార్డు చేయాలనే తలంపు వచ్చింది :)


Aug 2, 2012

బుల్లి కంగారు - కొత్త ప్రపంచం

ఒక బుజ్జి కంగారు ... అమ్మ సంచి లో కూర్చుని  వెచ్చగా , ఏ చీకూచింత లేకుండా హాయిగా కొంతకాలం గడిపింది . ప్రపంచాన్ని తనంతట తానే తెలుసుకోవాలనే ఉత్సాహం ఒక ప్రక్కన, కొత్తవి చూసి దడుచుకునే స్వభావం ఒక ప్రక్కన ... ప్రతి ఒక క్రొత్త అడుగులోనూ ...ఒక చిన్న, వింత ప్రపంచం !!

ముందైతే ఈ చక్కని కథ ని వినేద్దాం!! 
ఈ కంగారు పిల్ల లాగానే మనకి కుడా నిత్య జీవితం ఎన్నో సవాళ్ళు , ప్రశ్నలు, సమస్యలు ఎదురవుతుంటాయి. మొదట కొంచెం భయం భయం గానే వుంటుంది....కానీ వాటికీ వెరవక, మనసుకి నచ్చే స్నేహితుల తోడుతో, ముందడుగు వేస్తే ..... విజయమే!!  మరి మనం కుడా సవాళ్ళను చిరు నవ్వుతో స్వీకరిద్దామా??
Jul 5, 2012

మనం కుడా వీలైనంత సాయం చేద్దాం!!...సరేనా ?!


" స్నేహమేరా జీవితం ..స్నేహమేరా శాస్వతం " అన్నారు ఒక మహా కవి !! "ప్రార్ధించే చేతుల కన్నా సాయం చేసే చేతుల మిన్న " అని కుడా విని వున్నాం !!

అల్లాగే ఒక్కసారి సుమతీ శతకం లోని ఈ పద్యాన్ని కుడా  గుర్తుచేసుకుందాం!!


ఉపకారికి నుపకారము 
 విపరీతముగాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

మన స్నేహితులకి, కావాల్సినవారికి, ఐనవారికి - మనం కాకపోతే ఎవరు సాయం చేస్తారు? ఎవరికైనా అవసరానికి సాయం చేయటానికి  అస్సలు వెనుకాడకూడదు .... ఈ క్రింది కథ లో కుక్క పిల్ల , పిల్లి పిల్ల, బాతు పిల్ల  సాయం చేయటానికి వెనుకాడి, ఆఖర్న ఒక గుణపాఠం నేర్చుకున్నాయి!!   అదేంటో విందామా మరి ??!!


Jun 13, 2012

సత్యమే జయిస్తుంది ...

సత్యమేవ జయతే!  - అంటే - సత్యమే ఎప్పటికీ  జయిస్తుంది అనీ !!

ఇచ్చిన మాట మీద నిలబడాలని ...ప్రాణం పోయినా అబద్దం చెప్పకూడదనీ  ఈ క్రింది కథలో తెలుసుకుందామా ??!!

నిజం చెప్పటంలో ..నిజాయితీ గా వుండటం లో ...  ఒక ఆత్మసంతృప్తి, మనశ్సాoతి  వున్నాయి....!!మనం నిజాయితీ గా వుంటూ ...

             నిజం చెప్పేవాళ్ళకి  సహకరిద్దాం !! నిజాయితీగా ఉండటాన్ని ప్రోత్సహిద్దాం !! 

సరేనా ...?? :)

ఇలాంటిదే  మరోకథ!
May 23, 2012

అందం అంటే...??!!

అందం  అంటేమంచి రూపు రేఖలు కలిగి వుండటం కాదు! మంచి మనసు కలిగి వుండటం!!
మంచి నడవడిక, ప్రవర్తన, కలివిడితనం, స్నేహభావం, సహృదయం లేనినాడు..... అందానికి అస్సలు విలువ లేదు! ఇవన్నీ ఉన్ననాడు అందం తో పని లేదు !!!

                          బాహ్య సౌందర్యం కన్నా అంత:సౌందర్యం చాలా విలువైనిది.

బయటికి అందం గా లేమని, అందరిలో  గుర్తింపు లేదనీ విచారించకుండా ... మనం చేయగలిగిన పనులను ఆత్మవిశ్వాసం తో చేసుకుని ముందుకు వెళుతుంటే ...గుర్తింపు దానంతట అదే లభిస్తుంది!!

                           ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న !!

ఈ క్రింది కథలో ...దుప్పి ..ముందు అందానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి , తరువాత ఎలా తప్పు తెలుసుకున్నదీ ..విందామా?? :)

May 5, 2012

స్నేహితులలో ఏమి చూడాలి ?

మనం ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు ... వారి ప్రవర్తననీ , మంచి నడవడికనీ , వారిలోని మంచి మనసునీ చూసి స్నేహం చేయాలే కాని ... వారి రూపురేఖలనీ, ఆకారాన్ని, వస్త్ర ధారణనీ బట్టీ కాదు !

 ఒకరికి డబ్బు లేదనీ, మంచి బట్టలు వేసుకోలేదని , బీదవారనీ వారితో స్నేహం చేయకుండా ఉండకూడదు. "స్నేహం " అంటే అదేమరి!

ఈ క్రింది కథ లో ఆస్ట్రిచ్ పక్షి కి మంచి స్నేహితులు ఎలా దొరికారో విందామా మరి?!మీరు కూడా స్నేహితులతో చక్కగా మెలగుతారు కదూ ... ! :)


   

Apr 28, 2012

ఎవరు గొప్ప? సూర్యదేవుడు - వాయుదేవుడు

మనం చాలా సార్లు మన ప్రక్క వారితో మనల్ని పోల్చుకుని ఒకటి..పొంగిపోవటమో లేదా... క్రుంగిపోవటమో చేస్తూ ఉంటాము.... కానీ  రెండూ చాలా తప్పైనవి :) ... 

ఎవరికున్న ప్రత్యేకత వారిది ! 

ప్రక్కవారిలోని కొన్ని మంచి విషయాలు అనుకరించటం మంచిదే .. కానీ అవి కూడా "పులిని చూసి నక్క వాత పెట్టుకున్న " చందాన కాక మనకి సాధ్యమయిన రీతిలో మాత్రమే !

ఒకవేళ మనకే ఏదైనా ప్రత్యేకత వుంటే ... ప్రక్కవారిని హేళన చేయకుండా, సఖ్యతగా వుంటూ వారిని ప్రోత్సహించాలి ! మనం చేయగలిగేవి ప్రక్కవారు చేయలేకపోవచ్చు.. అలాగే ప్రక్కవారు చేయగలిగేవి మనం చేయలేకపోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుని .. అందరితో మంచిగా ప్రవర్తించాలి !

ఈ క్రింది కథ లో వాయుదేవుడు .. సూర్యదేవుని అపహాస్యం చేసి , తరువాత భంగపడి ... "ఎవరి ప్రత్యేకత వారిదే !" అన్న విషయం తెలుసుకున్నాడు...అదెలాగో మనము విందామా? 


 

Apr 23, 2012

మర్యాద రామన్న గారి కథలు .... మంచమ్మ - చెడ్దమ్మ

పిల్లలూ .. మర్యాద రామన్న గారనీ.. ఇదివరకటి రోజుల్లో ఒక తెలివైన గ్రామ పెద్ద ఉండేవారు. ఆయన తనదగ్గరికి సమస్యలతో వచ్చెవాళ్ళకి మంచి సలహాలు ఇవ్వటమే కాకుండా ... ఎటువంటి వ్యాజ్యాన్ని ఐన భలే తెలివితేటలతో , నిష్పక్షపాతం గా పరిష్కరించేవారు. ఈ క్రింద నేను చెప్పిన కథే దానికి ఒక నిదర్శనం.

ఈ కథలో వ్యాజ్యానికి వచ్చిన వాళ్ళు ఎటువంటివారో... ఒక చిన్న పరిక్షద్వార తెలుసుకుని.. భలేగా తీర్పు చెప్పారు .. మీరు కూడా వినేయండి మరి  :)


౧. నీటి ఆవస్యకతనీ, విలువనీ పిల్లలకి తెలియచెప్పండి.
౨. ఎక్కువ నీరు దుబారా చేసేవారు అప్పుల పాలు అవుతారు  - మా నాన్న చెప్పే వారు !
౩. నీరు ఒక సహజ వనరు అని తెలియజెప్పి .. నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రోత్సహించండి

Apr 12, 2012

విజయమో ! అనుభవమో! ఏదో ఒకటి ...

మనం మన జీవితం లో రకరకాల సమయాల్లో రకరకాల పనులు చేయవలసి వస్తుంది .... ఒక్కక్క పని మనకి చాలా కొత్తగా వుంటుంది .. మొదట్లో ఆ పని చేయాలన్నా, అసలా  పని మొదలుపెట్టాలన్నాచాలా బెరుకుగా , భయం గా వుంటుంది. కొన్నిసార్లు మనం ఈ పని సరిగ్గా చేయకపోతే ప్రక్కవారు ఏమనుకుంటారో , మనల్ని చులకన చేసి  ఏడిపిస్తారేమో అని అసలు పని మొదలుపెట్టటానికే చాలా భయ పడుతూవుంటాం.... ఆ భయానికి లొంగిపోయి మనకిష్టమైన పనులు కూడా చేయకుండా వాయిదా వేయటమో .. మొత్తం గా మానివేయటమో జరుగుతుంది.

కానీ... ఒక్కసారి ఆ భయాలన్నీ ప్రక్కన పెట్టి , నూటికి నూరుశాతం ఏకాగ్రతతో ఆ పని చేస్తే .... 
ఐతే ...ఆ పనిలో "విజయం"  సాధిస్తాం... 
లేదూ .. కనీసం "అనుభవం" అయినా సంపాదిస్తాం.....
లేదూ ..  "కనీసం ..ప్రయత్నమైనా చేసాం! " అన్న ఆత్మ సంతృప్తి అయినా మిగులుతుంది ... మరి మీరేమంటారు ???

ఈ క్రింది కథ లో చిట్టి ఎలుక తనకి తెలియని ఒక కొత్త పనిని, తనదైన విధానం లో చేసి ... విజయం పొందటమే కాకుండా ఒక మంచి అనుభవం కుడా సంపాదించింది..అదెలాగో విందామా ??

మరి మీరు కూడా ఏదైనా ఒక క్రొత్త పని చేసేటప్పుడు.. ఫలితం గురించి ఆలోచించకుండా ... ధైర్యం గా చేస్తారు కదూ!! ??

Apr 2, 2012

మాట కున్న విలువ పెంచుకుందామా !

అనగనగా ఒక ఊర్లో ఒక బుల్లి బుజ్జాయి ఉన్నాడట! వాడు భలే అల్లరి పిల్లాడు :) వాడు నాన్న చెప్పిన మాట వినకుండా ... అల్లరిగా ప్రవర్తించి ..అబద్దం చెప్పి .... నాన్నకి కోపం తెప్పించటమే కాక , ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ గుణపాఠం ఏమిటో తెలుసా....!! ??
 
" అబద్దాలు చెబుతూ వుంటే మాట కి వున్న విలువ తగ్గిపోతుంది.... ఎవ్వరూ మన మాట వినరు " అని.!
 
మరి మనం కుడా ఆ కథ ఒకసారి విందామా ....
 
 
 

Mar 14, 2012

కలసి మెలసి ఉందామా.. ??

హాయ్…
ఇదివరకూ ప్రతీ  కుటుంబం లోనూ అమ్మ, నాన్న, అన్నయ్యలు, చెల్లెళ్ళు,  బాబాయిలు, పిన్నులు, బామ్మా తాతయ్య లు అందరు కలిసి వుండేవారు.. ఇంటి పనిని   ఆడవాళ్ళు అందరు కలిసి పంచుకుంటే … బయటి పనిని మగవాళ్ళు అందరు కలిసి పంచుకునేవారు. సంతోషాన్ని  దుఃఖాన్ని అందరు కలిసి పంచుకునేవారు . ఇప్పుడు మనింట్లో అంత మంది వుండటం లేదు కదా! మరి అందుకని మనం వీలైనప్పుడల్లా అమ్మానాన్నలకి .. తాతయ్యాబామ్మలకి సాయం చేయాలి.
ఏదైనా వస్తువు లేదా విషయం ఎవరో ఒకరితో కలిసి పంచుకుంటే ఎంత అందం గా  ఆనందం గా వుంటుందో ఈ చిన్న కథ లో తెలుసుకుందామా??


అలాగే ఏదైనా కష్టమైనా  పని చెసేటప్పుడూ అందరు కలిసి ఆ పని చేస్తే ఆ పని చాలా సులువుగా అయిపోతుంది ... అదెలాగో ఈ కథ లో తెలుసుకుందాం...
 

మరీ ... ఎవరైనా మంచి పని చేసేటప్పుడు మీరు కుడా సాయం చేస్తారు కదూ..  :)

Mar 6, 2012

దురాశ వద్దు!

అంతులేని దురాశ వల్ల మనకీ ఎప్పుడూ కష్టాలే! ఉన్నదాన్ని చూసి సంతోషించలేము... ప్రశాంతం గా వుండలేము... ఎప్పుడూ మనకి లేనివాటికోసం ఏడవటమే సరిపొతుంది.  అలాగే అబద్ధాలు  ఆడుతూపోతున్నా కూడా!  చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికీ బోల్డు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కాబట్టీ .. నిజాయితీ గా  వుంటే మనకి ఈ బాధలేమీ  వుండవు... పైగా అందరికీ మన మాట మీద నమ్మకమూ, గౌరవమూనూ....

మరి మీరూ నిజాయితీ గా , సంతోషం గా వుంటారు కదూ... :)

ఈ క్రింది కథ లో... దురాశ దుఃఖానికి చేటని ...అలాగే ప్రాణం పోయినా అసత్యం పలకకూడదనీ, నిజాయితీ గా వుండాలనీ తెలుసుకుందాం !


Mar 4, 2012

అమ్మానాన్న ల మాట విoదాం!


నేను చెప్పబోయే ఈ కథ మీఅందరికీ ఏం చెబుతుందో  తెలుసా !!?? .... " అమ్మా నాన్న ల మాట వినాలనీ.. వాళ్ళేం చెప్పినా మన మంచి కోసమే..."  అనీను:)  మనం స్వతంత్ర భావాలు ఏర్పరుచుకుంటూనే /  స్వతంత్ర్యంగా వుండటం నేర్చుకుంటూనే .. తల్లిదండృల అభిప్రాయాలని / అనుభవాలని  కూడా పరిగణనలోకి తీసుకోవాలి... అనీను!

ఈ కథలో ఒక చిట్టి చేప పిల్ల అమ్మ మాట వినకుండా బయటకి వెళ్ళినందుకు పడిన కష్టాలు , నేర్చుకున్న గుణపాఠం... అలాగే గొప్పలకు పోయి ముప్పు తెచ్చుకున్న ఒక కప్ప గురించి తెలుసుకుందాం !
  తల్లిదండృలకి నాకు తోచిన సలహాలు:
----------------------------------------

1. చేప పిల్ల ఎలా ఈదుకుంటూ వెళ్ళిందో మీ చేతులని చేపపిల్లగా ( ఒక చేయి మీద ఇంకో చేయి వేసి బొటనవేళ్ళు తెడ్లు లాగా వూపటం ) మార్చి , ఈదుతున్నట్టు గా చేసి  చూపించండి.(అందరికీ తెలిసినదే... ఏమిటో నా తాపత్రయం ! :D)

2. చేపపిల్ల భయపడుతూ మట్లాడుతున్నచోట మీరు కూడా భయం,భయం గా అభినయిస్తూ మాట్లాడండి. ( Come on ... start camera... ready.. ACTION )

3. కప్ప రెచ్చిపొయి పాట పాడే సందర్భం లో మిమ్మలి మీరు మైఖేల్ జాక్సన్ లా వూహించుకుని ... భీబత్సం చేసెయండి అంతే!  

4. ఒక చేతిని కప్పలనూ... మరో చేతిని పాము లాను చేసి... కప్ప పాడుతున్నట్టు... పాము పాకుతూ వస్తున్నట్టూ...  రెండు ఫ్రేముల్లో మీ పిల్లలకి సినిమా చూపిస్తూ .. కప్పని ఆమామ్మ్ తినేయండి.  :)
Mar 1, 2012

పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టూ...

మనం మన జీవితం లో చాలా మందిని చూసీ... వారిలాగా మనం ఎందుకుచేయకూడదు??... అని తర్కించుకుంటూ వుంటాం.  అలా ప్రక్కవారిని అనుకరించేముందు.... మనమేమిటో, మన శక్తిసామర్ధ్యాలేమిటో తెలుసుకుని తెలివిగా మెలగాలిగానీ ...గుడ్డిగా అనుకరించకూడదు. 

మనకున్న దానిలో మనం "సంతృప్తి" గా జీవించాలి. అందని పళ్ళ్ళకి అర్రులు చాచి అల్లరి పడకూడదు. 

అదెలాగో ఈ కథలో తెలుసుకుందామా....!!??

Feb 29, 2012

అమ్మనాన్నలమీద కోపంతెచ్చుకోకండే !!

పిల్లలూ... మీరు బాగా అల్లరి చేస్తున్నారా?? అమ్మానాన్నలకి బాగా కోపం తెప్పిస్తున్నారా???

 పిల్లలు ఏం చేసిన అమ్మనాన్నలకి కోపం రాదు... ఆ అల్లరి ముద్దుగా వుంటే. మరీ... అమ్మా వాళ్ళకి మిమ్మల్ని కొట్టేయటం, తిట్టేయటం అస్సలు నచ్చదు.. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా ఎక్కువ బాధ పడేది వాళ్ళే! మీరు ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ దుష్ప్రవర్తన నేర్చుకుంటారో అనే వాళ్ళ భయం. మిమ్మల్ని అందరూ మెచ్చుకునేలా మంచి నడవడికతో  , మంచి బుద్ధులతో పెంచాలనే వళ్ళ తాపత్రయం. కాబట్టీ  అమ్మవాళ్ళు కొప్పడినాకానీ ఎక్కువ నొచ్చుకోకుండా , తిరిగి అమ్మనాన్నలమీద కోపంతెచ్చుకోకుండా చక్కగావుండాలి.. మరే... పిల్లలు ఎలా అల్లరి చేస్తే తల్లిదండృలకి ముద్దుగావుంటుందో ఈ కథలో తెలుసుకుందామా ??


తల్లిదండృలకి సూచనలు:
-----------------------------
1. ఈ కథ లోని జంతువుల సంభాషణలు సాధ్యమైనంత నవ్వు తెప్పించేవిధంగా అనుకరించండి.
2. కోడిపెట్ట హత్తుకున్నచోట మీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని మీరుకుడా హత్తుకొని ముద్దుపెట్టేయండి. :)
3. పిల్లలు అల్లరి ఎలా చేయలో ( మీ దృష్టిలో  ) లెక్చరు దంచేయండి మీ పిల్లలకి ;) ALL THE BEST
Feb 24, 2012

ఏనుగు - దర్జీవాడు

ఈ కథ మా అబ్బాయి కి చాలా ఇష్టం. వాడికి ఏనుగు  అంటేనే ప్రాణం. ఈ  "ఏనుగు -  దర్జీవాడు" కథ ఐతే  మా వాడికి లెక్కలేనన్నిసార్లు చెప్పివుంటాను :)  మా అబ్బాయిలాగా చాలామందికి  ఈ కథ నచ్చుతుందని ఈ ఆడియో రికార్డు  చేసాను. ఇంకెందుకు ఆలస్యం?? వినేయండి మరీ... :)
తల్లిదండ్రులకు సూచనలు :
-----------------------------
1. మీ పిల్లలకి ప్రతీ రాత్రి ఒక కథ ఐనా చెప్పటానికి ప్రయత్నించండి.
2. వీలైనంతగా వారు కథల పట్ల ఆకర్షితులయ్యేలా  చెప్పటానికి ప్రయత్నించండి.
3. విపరీతమైన కామెడి చేయండి వీలైనచొటల్లా.
4. పుస్తకాలతో అనుబంధం పేరిగేలా ప్రొత్సహించండి.

ఈ కథ కి సంబంధించిన సలహాలు :
---------------------------------------

1. నేను టిక్ -టిక్ అని చెప్పినచోట మీరు చూపుడు వేలు, మధ్యవేలుతో పిల్లల పొట్ట మీద / చేయి మీద నడుస్తున్నట్టుగా   అభినయించండి. పిల్లలు బాగా ఎంజొయ్ చేస్తారు :)
2. ఏనుగులా ఘీంకరించినప్పుడు - మీరు మీ చేయిని తొండం లాగ వూపండి.
3. దీవించింది అన్నప్పుడు - మీ చేయే తొండం కనుక  మీ చేతిని వారి తల మీద పెట్టి దీవించండి
4. చెరువులో నీళ్ళు తాగుతున్నప్పుడు : మీ తొండం తో  ( సారీ...  మీ చేతితో  :D ) నిజంగానే నీళ్ళు పీల్చుకుంటున్నట్లూ... స్నానం చేస్తున్నట్టూ...ఆఖర్న  పిల్లవాడి మీద కోపం గా /విసురుగా చల్లుతున్నట్టూ అభినయించండి. 

మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ  ఈ కథ చెప్పమని మీ ప్రాణం తీయకపొతే నన్ను అడగండి :)Feb 22, 2012

బుజ్జి కుక్క పిల్ల - పుస్తకం- ఆనందం

హలో ...
" కలసి వుంటే కలదు సుఖం "  అనే విషయాన్ని ఒక సరదా కథ లో తెలుసుకుందాం !  

అనగనగా ఒక బుజ్జి కుక్క పిల్ల వుంది. అది గ్రంధాలయం (Library)  కి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంది.  అప్పుడూ ...దాని స్నేహితులు.... బాతు, ఉడుత , పిల్లి, కుందేలు కూడా  ఆ పుస్తకం చదవాలనుకున్నాయి... అప్పుడేమైందో తెలుసా!! ?? ఐతే ఈ కింద కథ వినండి :)


ముందుగా నా మనసులో మాట !

నమస్తే! :-)
పిల్లల ప్రపంచం లో కథలకి వున్న ప్రాముఖ్యత అంతా,ఇంతా కాదు! కథలు వినోదాన్నిస్తూనే అంతర్లీనం గా పిల్లల్లో ఊహశక్తిని, విశ్లేషణ చేసే శక్తిని, సమయస్ఫూర్తిని, తెలివితేటలనీ పెంచుతాయి అని ప్రగాఢంగా నమ్ముతాను. అటువంటి కథలను నాకు తెలిసిన పధ్ధతిలో  - పిల్లలని ఆకట్టుకునేవిధం గా - సరదాగ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను.  ఈ కథలు మీకు గానీ, మీ పిల్లలకి గానీ కథల మీద ఏ మాత్రం ఇష్టాన్ని, ఆసక్తినీ కలిగించినా సంతోషిస్తాను. 
 
 నేటి ఇంటెర్నెట్ యుగంలొ  పిల్లలు కార్టూన్ లు చూడటనికి తద్వార దౄశ్య మాధ్యమానికి బాగా అలవటుపడిపొతున్నారు. ఏదైన వినటం ..అర్ధం చేసుకొవటం .. ఊహించుకోగలగటం వంటి మంచి అలవాటుని తెలియకుండానే కోల్పోతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అన్ని సమస్యల కి ముఖ్య కారణం పక్క వారి సమస్యలను సావధనం గా విని అర్ధం చేసుకోకపోవటమే!!

నా ఈ చిన్ని ప్రయత్నం పిల్లల్లొ యెంతో ముఖ్యమైన "వినటం" అనే ఒక మంచి అలవాటు చేస్తుందనీ  .....

అలాగే భార్యాభర్తలు ఇద్దరూ పని చేయవలసిన అవసరం యేర్పడిన ఈ రోజుల్లొ పిల్లలతో గడిపే సమయం ఎంత లేదన్నా కూడా బాగా తగ్గింది.ఉన్న కాస్త సమయం లో ఏ కధలు చెప్పాలి? ఎలా చెప్పాలి ? అని ఆలొచించే తల్లిదండ్రులు యెంతో మంది. అలాంటి వారికి ఈ సైటు యె కొంతైనా సాయం  చేయాలనీ ......

నేను విన్న కథలను, చదివిన కథలనూ నా తరహా లో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నాకు తోచిన చిన్న,చిన్న సలహాలను తల్లిదండ్రులకు తెలియచేస్తాను. సహృదయం తో ఆదరిస్తారని ఆశిస్తూ...
 


ఈ బ్లాగు  ఆలోచనని నాకు కల్పించిన సాయి ( http://namanasucheppindi.blogspot.in ) గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.